Successful Removal of 3.7 KG Large Abdominal Tumorfrom 14-Year-Old Somalian Girl at KIMS Cuddles Hospital

14 ఏళ్ల సోమాలియా బాలిక కడుపులో మూడున్నర కిలోల క‌ణితి* విజ‌య‌వంతంగా తొల‌గించిన కిమ్స్ కడల్స్ వైద్యులు* కుడివైపు మూత్ర‌పిండం కూడా తొల‌గింపు హైద‌రాబాద్, మే 16, 2024: ఆఫ్రికాలోని సోమాలియా దేశానికి చెందిన ఒక ప‌ద్నాలుగేళ్ల బాలిక కడుపులో ఏకంగా 3.7 కిలోల క‌ణితి ఉంది. దాని కార‌ణంగా ఆమె తీవ్రంగా బాధ‌ప‌డుతూ సొంత దేశంలో కొన్ని ఆస్ప‌త్రుల‌కు వెళ్లింది. అక్క‌డి వైద్యులు సీటీస్కాన్ లాంటి ప‌రీక్ష‌లు చేసి, క‌ణితి ఉంద‌ని గుర్తించారు. అయితే అది కుడివైపు మూత్రపిండానికి అతుక్కుని ఉంది. సికింద్రాబాద్‌లోని కిమ్స్ క‌డ‌ల్స్ ఆస్ప‌త్రి వైద్యులు ఆమెకు శ‌స్త్రచికిత్స చేసి, ఊర‌ట క‌ల్పించారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆస్ప‌త్రికి చెందిన చీఫ్ క‌న్స‌ల్టెంట్ పీడియాట్రిక్ లాప్రోస్కొపిక్ స‌ర్జ‌న్, పీడియాట్రిక్ యూరాల‌జిస్ట్ డాక్ట‌ర్ ఎం. యోగ‌నాగేంద‌ర్ తెలిపారు.“సోమాలియాకు చెందిన 14 ఏళ్ల బాలిక తీవ్ర‌మైన క‌డుపునొప్పితో బాధ‌ప‌డుతోంది. దాంతోపాటు ఆమెకు ఆక‌లి లేదు. దీంతో సొంత దేశంలో ఆస్ప‌త్రుల‌కు వెళ్లింది. అక్క‌డ సీటీ స్కాన్ తీసిన వైద్యులు క‌డుపులో పెద్ద క‌ణితి ఉంద‌ని, అయితే ర‌క్త‌నాళాల‌కు అతుక్కుని ఉండ‌టంతో ఇక్క‌డ శ‌స్త్రచికిత్స చేయ‌లేమ‌ని చెప్పారు. భార‌త‌దేశానికి వెళ్లాల‌ని సూచించారు. అక్క‌డి నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన బాలిక త‌ల్లిదండ్రులు ఇక్క‌డ వివిధ ఆస్ప‌త్రుల‌ను సంప్ర‌దించిన త‌ర్వాత సికింద్రాబాద్‌లోని కిమ్స్ క‌డ‌ల్స్ ఆస్ప‌త్రికి వ‌చ్చారు. ఇక్క‌డ బాలిక‌కు త‌గిన ప‌రీక్ష‌లు చేయ‌గా, కుడివైపు మూత్ర‌పిండానికి అతుక్కుని, అక్క‌డి నుంచి దాదాపు ఉద‌ర‌భాగం మొత్తం వ్యాపించిన క‌ణితి ఉన్న‌ట్లు తేలింది. దాంతో పీడియాట్రిక్ స‌ర్జ‌న్‌, పీడియాట్రిక్ యూరాల‌జిస్టు డాక్ట‌ర్ అవినాష్ రెడ్డితో క‌లిసి మొత్తం బృందం ఈ బాలిక‌కు శ‌స్త్రచికిత్స చేశాము. ర‌క్త‌నాళాల‌కు ఎలాంటి న‌ష్టం వాటిల్ల‌కుండా అత్యంత నేర్పుతో ఈ శ‌స్త్రచికిత్స చేయాల్సి వ‌చ్చింది. మూత్ర‌పిండానికి అతుక్కుని ఉండ‌టంతో కుడివైపు మూత్ర‌పిండాన్ని సైతం తొల‌గించాల్సి వ‌చ్చింది. బ‌య‌ట‌కు తీసిన త‌ర్వాత క‌ణితిని ప‌రీక్షిస్తే, అది ఏకంగా 3.75 కిలోల బ‌రువు ఉంది. బ‌యాప్సీకి పంప‌గా, అది కేన్స‌ర్ కాద‌ని.. సాధార‌ణ క‌ణితేన‌ని తెలిసింది. ఇప్పుడు ఆ బాలిక‌కు ఒక మూత్ర‌పిండం మాత్ర‌మే ఉంది. అయినా ఆమె జీవితానికి ఎలాంటి ఢోకా లేదు. అయితే దీర్ఘ‌కాలం పాటు నొప్పి నివార‌ణ మందులు వాడ‌క‌పోవ‌డం, త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం మాత్రం అవ‌స‌రం. ఈ విష‌యాల‌న్నింటినీ బాలిక‌కు, ఆమె తల్లిదండ్రుల‌కు వివ‌రించాం” అని డాక్ట‌ర్ ఎం. యోగ‌నాగేంద‌ర్ చెప్పారు.ఉదర భాగం మొత్తం ఆక్రమించిన ఇంత పెద్ద కణితిని తీసేసిన తర్వాత ఆ కుటుంబం ఎంతో సంతోషించింది. ఇప్పుడు ఆ బాలిక కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఆ కుటుంబ సభ్యులందరూ డాక్టర్ యోగా నాగేందర్, డా. అవినాష్, పీడియాట్రిక్ శస్త్రచికత్స బృందానికి మరియు కిమ్స్ కడల్స్ సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *